ఏపీలో ఘరానా మోసం.. ఏకంగా 50 కోట్లు కొట్టేశాడు !

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. అదేంటంటే పెన్షన్ స్కీమ్ పేరిట వేలాది మంది నుంచి 50 కోట్ల రూపాయలు వసూలు చేసిన రూపేష్ కుమార్ ఇప్పుడు పంగనామాలు పెట్టి పరారయ్యాడు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు రూపేష్ కుమార్ ను అరెస్ట్ చేసి, అనంతరం వదిలేశారు పోలీసులు. నిందితుడిని వదిలేశారన్న కారణంగా పెద్దమండ్యం పిఎస్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ నాయక్, కానిస్టేబుల్ గంగాధర్ లు సస్పెండ్ కూడా అయ్యారు.

అయితే ఒక్కసారి రూ.12 వేలు చెల్లిస్తే నెలనెలా మూడు వేలు పెన్షన్ గా ఇస్తామని నమ్మించిన రూపేష్ కుమార్ పెన్షన్ స్కీం పేరిట 45 వేల మంది నుంచి దాపుగా 50 కోట్ల రూపాయల వసూలు చేసినట్టు సమాచారం అందుతోంది. వందల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకొని అక్రమ వసూళ్లు చేసినట్టు చెబుతున్నారు. అయితే కరోనా సాకు చూపి డబ్బులు చెల్లించకుండా రూపేష్ కుమార్ చేతులెత్తేసినట్టు చెబుతున్నారు. బాధితుల్లో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా వాసులతో పాటు కర్ణాటకకు చెందిన వేలాది మంది ఉన్నట్టు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరు చెప్పినా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నా జనం వినకుండా ఇలా మోసగాళ్ళ బారిన పడుతున్నారు.