రాజస్థాన్ మహిళలకు ఆ రాష్ట్ర సర్కార్ సూపర్ గిఫ్ట్ అందజేయనుంది. దీనికోసం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఓ వినూత్న స్కీమ్‌తో ముందు కొచ్చింది. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మూడేళ్ల పాటు ఉచితంగా ఇంటర్నెట్, ఇతర సేవలను కూడా అందించనుంది.
ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలు, టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరిట ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని మహిళలకు ఈ ఫోన్లు అందిస్తారు. 1.35 కోట్లుగా ఈ లెక్క తేల్చారు.
వీరికి ఉచిత స్మార్ట్‌ఫోన్‌తో పాటు, మూడేళ్ల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇందులో మొదటి సిమ్‌కార్డు లాక్ చేసి ఉంటుంది. రెండో సిమ్ స్లాట్‌లో ఇంకో సిమ్ కార్డు వేసుకునే వీలుంటుంది. స్మార్ట్‌ఫోన్, మూడేళ్ల ఇంటర్నెట్ కలిపి మొత్తం రూ.12వేల కోట్లు అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థల నుంచి అక్కడి యంత్రాంగం బిడ్లను ఆహ్వానించింది. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. ఇందుకోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోటీ పడుతోంది. ఏ కంపెనీకి ఈ టెండర్ దక్కినా ఒక్కసారి 1.35 కోట్ల వినియోగదారులు వచ్చి చేరినట్లే. ఈ పండగ సీజన్‌లోనే తొలిదశ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టాలని సర్కారు భావిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘ఉచిత’ స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది.