భవిష్యత్ తరాలు నేటి మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి : కేటీఆర్

-

చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డీలిమిటేషన్ మీద ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలు తప్పకుండా ప్రశ్నిస్తాయని అన్నారు.
కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నాము.

తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి .దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈరోజు నష్టం జరుగుతుంది.

మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు.మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు.దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది.పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.

దేశానికి 36% జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి.డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు.ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది.

ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది.దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది.వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమీ వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం.

జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈరోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు.

ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది.డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు . ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు
భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version