గన్నవరం వైసీపీని వివాదాలు వదలటంలేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట రెండు వర్గాల గొడవలు జరుగుతూనే ఉన్నాయ్. తాజాగా ఇళ్ళ పట్టాల పంపిణీకి వెళ్తున్న ఎమ్మెల్యే వంశీని అడ్డుకోవడం టెన్షన్ రేకెత్తించింది. పదేపదే హైకమాండ్ కల్పించుకుంటున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
మొన్న కేశర పల్లి…నిన్న గొల్లనపల్లి…నేడు మల్లవల్లి…ఇవన్నీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లోనే వరుసగా వైసీపీ వర్గాల మధ్య ఎమ్మెల్యే వంశీ సాక్షిగా గొడవలు జరుగుతున్న ప్రాంతాలు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి వెళ్ళిన మల్లవల్లిలో స్థానిక గ్రామస్తులు అడ్డుకోవంటతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్తులు రోడ్లపై బైటాయించి, వాహనాలను రోడ్డుకి అడ్డుగా పెట్టడంతో వంశీ వెనుతిరగక తప్పలేదు. పోలీసులు భారీగా మోహరించిన తర్వాత తిరిగి ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి వంశీ మల్లవల్లి వచ్చారు. గన్నవరంలో ఇళ్ళ పట్టాల పంపిణీ ఒక్కటే కాదు అన్ని విషయాల్లో ప్రతి గ్రామంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. వారం క్రితం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వంశీ రాకముందే ఆయన వర్గంలోనే ఇద్దరు రోడ్డుపై బాహాబాహీకి దిగి కొట్టుకున్నారు. రెండు రోజుల క్రితం గొల్లనపల్లిలో ఇళ్ళ పట్టాల పంపిణీలో యార్లగడ్డ, వంశీ వర్గాల మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు ఏఎంసీ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ ఎస్టీ మహిళను కాబట్టే తనను ఇళ్ళపట్టాల పంపిణీకి ఎమ్మెల్యే ఉమా దేవి పిలవలేదంటూ దుట్టా వర్గానికి చెందిన భూక్యా ఉమాదేవి ఆరోపించారు. ఇలా వరుస గొడవలు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న గన్నవరం నియోజకవర్గం వైసీపీ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తోంది.