విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంగా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థంలో గల కోదండరామ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర, విశిష్టత ఉన్నాయి. ప్రధాన ఆలయంతోపాటే అదే ఊరిలోని బోడి కొండపైనా దేవతామూర్తులతో ఆలయం ఉంది. కొండపైనున్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల ఖండనకు గురై, సమీపంలోని తుప్పల్లో పడి ఉండటాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారన్న సమాచారంతో రామతీర్థం గ్రామస్తులు వందలాదిగా బోడి కొండపైకి వెళ్లారు. జిల్లా ఎస్పీ రాజకుమారి సైతం అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ ను పురమాయించారు. కేసు నమోదు చేసుకుని, దుండగులను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు.. గత రెండేళ్లలో రాష్ట్రంలో 20 దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ ఇంతవరకూ ఒక్కరిపై కూడా చర్యల్లేవని ఆరోపించారు. రామతీర్థం ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని డిమాండ్ చేశారు. ఏపీలోనే కాక, దేశవ్యాప్తంగానూ గుర్తింపు పొందిన ఆలయాల్లో ఒకటైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ఖండనకు గురైందన్న వార్త వినగానే అన్ని పార్టీల నేతలు బోడి కొండకు పరుగులు తీశారు. స్థానిక నెల్లిమర్ల వైసీపీ ఎంపీ అప్పలనాయుడు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆలయాలపై దాడులు అలవాటుగా మారిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముష్కరులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా బీజేపీ చీఫ్ పావని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీడీపీ జిల్లా నాయకులు రవిశంకర్ సహా పలువురు నేతలు ఆందోళనలను చేపట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ… రామతీర్థం ఘటన చాలా బాధాకరమని చెప్పారు. ఓ వైపు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మిస్తుంటే మరోవైపు ఏపీలో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. దేవుళ్ల విగ్రహాలు, ఆలయాలపై దాడుల ఘటనలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు ఇకనైనా ఆగాలని ఆయన అన్నారు.