డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సహజంగానే చిన్నారులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, గొంతు ఇన్‌ఫెక్షన్లు, ఛాతిలో మ్యూకస్ రావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను మీ పిల్లలకు అందజేస్తే దాంతో వారి శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో వారు ఆయా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
కూరగాయలు…
కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. వాపులను తగ్గిస్తాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంటో వ్యాధులు రాకుండా ఉంటాయి. పాలకూర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు తదితర కూరగాయలను ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
పండ్లు…
నిత్యం ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు. అని చెబుతుంటారు. అయితే సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం ఈ విషయం నిజమే అని తేలింది. ఎందుకంటే యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, విటమిన్ సి, ఫైబర్‌లు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. ఇక యాపిల్ పండ్లతోపాటు పిల్లలకు నారింజ, జామ పండ్లు ఇస్తే మంచిది. వాటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
పప్పులు…
పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణజాలానికి మరమ్మత్తులు చేస్తాయి. దీంతోపాటు శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ క్రమంలో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పిల్లలకు నిత్యం పప్పు దినుసులు పెడితే మంచిది.
కోడిగుడ్లు, పుట్టగొడుగులు…
వీటిల్లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.