స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ఇప్పుడు వాటిల్లో యాప్‌లకు కొదువ ఉండడం లేదు. ఇక టైం పాస్ చేసే విషయానికి వస్తే ప్రస్తుతం డేటింగ్ యాప్‌లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. అందులో భాగంగానే కరోనా టైంలో గ్లీడెన్ అనే డేటింగ్ యాప్‌కు గడిచిన 3 నెలల కాలంలోనే కంగా 246 శాతం సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గ్లీడెన్ యాప్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. ఇక గత 4 నెలల కాలంలో ఈ యాప్‌కు కొత్తగా 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చి చేరగా.. కేవలం గత 2 నెలల వ్యవధిలోనే 2.50 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌కు చేరడం విశేషం. దీంతో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ యాప్‌కు గాను సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 246 శాతం పెరిగింది.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది రియల్ డేటింగ్ కన్నా ఆన్‌లైన్ డేటింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని గ్లీడెన్ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ముఖ్యంగా వారాంతాల్లో ఈ యాప్‌లో యూజర్లు ఎక్కువగా సమయం గడుపుతున్నారని, వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. అలాగే నిత్యం రాత్రి 10 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈ యాప్‌ను వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కాగా 2019తో పోలిస్తే ఈ ఏడాది ఈ యాప్‌లో యూజర్లు గడుపుతున్న సమయం 3 రెట్లు పెరగడం విశేషం.