రైతుల ఉద్యమం హైజాక్ చేశారా..ఖలిస్థాన్ నెట్‌వర్క్‌పై కేంద్రం నిఘా

-

దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్న ఖలిస్థాన్ నెట్‌వర్క్‌పై కేంద్రం ఓ కన్నేసి ఉంచింది .. కాలగర్భంలో కలిసిపోయిన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ మళ్లీ పుంజుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతుల నిరసనలను ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థలు హైజాక్ చేస్తున్నాయట. అందుకే కేంద్రం రంగంలోకి దిగింది.

ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థలు, ఉగ్రవాదులు, సానుభూతిపరులపై దర్యాప్తును ముమ్మరం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఐఏ, ఈడీ, సీబీఐ, ఎఫ్ఐయూ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. అన్ని విధాలుగా ఈ దర్యాప్తును నిర్వహిస్తాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని.. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలు హైజాక్ చేసినట్టు వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ పోలీసులు, పంజాబ్ రాష్ట్ర నిఘా సంస్థలు, కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థలు పంజాబ్ తదితర ప్రాంతాల్లో పట్టు పెంచుకుంటున్నాయి.. ఖలిస్థాన్ అనుకూల సంస్థలకు, ఎన్‌జీవోలకు విదేశీ నిధులు అందుతున్నాయి. దీంతో ఆయా సంస్థలపై దర్యాప్తును మరింత తీవ్రం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుద్దరించేందుకు పాకిస్తాన్ లోని ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. గత ఏడాది కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను ప్రారంభించినప్పటి నుంచి పాక్ లోను, విదేశాల్లోనూ ఉన్న ఖలిస్థాన్ అనుకూల సంస్థలు చురుకుగా వ్యవహరించడం ప్రారంభించాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో పాక్ ఖలిస్థాన్ నినాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం.

అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో.. సిక్కు వర్గానికి చెందిన వందలాది మంది నిరసనకు దిగిన సమయంలోనూ ఖలిస్థాన్ రంగు బయటపడింది. ఇండియన్ ఎంబసీ వద్ద ఖలిస్తాన్ వేర్పాటు వాదులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆయన విగ్రహానికి ఖలిస్తాన్ జెండాలు కప్పారు. ఇదంతా భారత్ నిఘా వర్గం గమనించింది.

Read more RELATED
Recommended to you

Latest news