ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే జీఎన్‌రావు నిపుణుల కమిటీ శుక్రవారం సాయంత్రం సీఎం జగన్‌తో సమావేశమైంది. ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పటికే ఓసారి మధ్యంతర నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ తాజాగా పూర్తి వివరాలతో నివేదికను సీఎంకు సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయన్న కమిటీ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కీలక సూచనలను చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలని జీఎన్ రావు కమిటీ పేర్కొంది.
ఈ క్రమంలోనే పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైందని స్పష్టం చేసింది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి అని సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా చూడాలని తేల్చారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి శ్రీకాకుళం, విజయనగరం ఒక మండలిగా చూడాలి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాను రెండో మండలిగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడో మండలిగా సీమ నాలుగు జిల్లాలను నాలుగో మండలిగా చూడాలి.
అయితే వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో కాకుండా ఎలాంటి ముప్పులేని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని తెలిపారు. అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అమరాతిలో రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు. మరియు సమగ్ర అభివృద్ధి కోసం అనుసరించాల్సిన విధానాలను… ప్రభుత్వానికి సిఫార్సు చేశామని జీఎన్‌రావు కమిటీ సభ్యులు తెలిపారు.