కరోనా లక్షణాలు ఉన్న వారికి వేగవంతంగా టెస్టులు చేయవచ్చని చెప్పి మన దేశంతోపాటు పలు ఇతర దేశాలు కూడా చైనా నుంచి పెద్ద ఎత్తున టెస్టు కిట్లను తెప్పించుకున్నాయి కదా.. అయితే అవి అసాధారణ ఫలితాలను ఇస్తున్నాయని, నాసిరకంగా పనిచేస్తున్నాయని వెల్లడి కావడంతో వాటిని ఉపయోగించవద్దని నిర్ణయించారు. అయితే టాంజానియా దేశం కూడా చైనా నుంచి కరోనా టెస్టు కిట్లను దిగుమతి చేసుకుందో, ఏమో తెలియదు కానీ.. అక్కడ వింత వింత ఫలితాలు వస్తున్నాయి.
టాంజానియాలో తాజాగా ఓ మేకకు, పాపా (pawpaw) అనే ఓ పండుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడ ఉపయోగిస్తున్న టెస్టు కిట్లు సరిగ్గా పనిచేయడం లేదని, అవి నాసిరకమైనవని తేల్చారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులి ఆ టెస్టు కిట్లను వాడకూడదని నిర్ణయించారు. అయితే అక్కడ మనుషులతోపాటు ఇతర జీవులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. దీంతో ఇలాంటి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
అయితే టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి వ్యవహారంపై అక్కడి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఓ వైపు ప్రజలు కరోనాతో బాధపడుతుంటే నాణ్యమైన టెస్టు కిట్లతో పరీక్షలు చేయాల్సింది పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఇక ఆ దేశంలో ఆదివారం వరకు 480 కరోనా కేసులు నమోదు కాగా, 17 మంది చనిపోయారు.