యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధానాలయంలో స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసి ఉన్న గర్భాలయ విమాన గోపురానికి రూ.40 కోట్ల వ్యయంతో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు. ఇందుకు 60 కిలోల బంగారం అవసరమవుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని భక్తులు ముందుకు వస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే యాదాద్రి దేవస్థానం వద్ద ఉన్న ఉపయోగంలో లేని బంగారంతో ధ్వజస్తంభం, ప్రధానాలయ తలుపులకు బంగారు తాపడం చేయించామని, బంగారు తొడుగుల బిగింపు పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా బస్బే, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. బస్బే, వాహనాల పార్కింగ్ కోసం రక్షణ గోడల నిర్మాణాలు, కొనసాగుతున్నాయి. నాలుగంతస్తులో ప్రసాదాల తయారీ భవనం పూర్తైంది. మూడో అంతస్తులో యంత్ర పరికరాల బిగింపు మొదలైంది. లడ్డూ ప్రసాదాల, విక్రయ కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.