తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం విడుదల చేసింది. టెట్ ను జూన్ 12 వ తేదీన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగ మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వ తేదీ వరకు టెట్ పరీక్ష కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగ బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.
అంతే కాకుండా.. గతంలో వచ్చిన జీవో నెంబర్ 36 లో రెండు సవరణలు చేసి కొత్తగా జీవో నెంబర్ 8 ను విడుదల చేసింది. ఈ జీవో వల్ల టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారి వ్యాలిడిటీ ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడగించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసింది. అలాగే 2011 ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి ఈ మార్పులను అమలు చేశారు. అంటే.. అప్పటి నుంచి టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారికి జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. కాగ ఈ ఉత్తర్వులు విడుదల అయిన మరుసటి రోజే.. టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం.