రెండు వేల నోటుపై కేంద్రం గుడ్ న్యూస్…!

-

కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత ప్రవేశ పెట్టిన రెండు వేల నోటు ప్రజలకు అన్ని విధాలుగా చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వెయ్యి రూపాయల నోటుకి చిల్లర దొరకక జనం నానా ఇబ్బందులు పడే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల నోటుని తీసుకుని రావడంతో ప్రజలు చిల్లర దొరకక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు వందలకు పైగా ఏదైనా కొనుగోలు చేస్తేనే చిల్లర ఇస్తున్నారు.

దీనితో పేదలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఈ నోటు రద్దు అయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. రద్దు అయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా ప్రజలు మాత్రం భయపడుతూనే ఉన్నారు. ఇక ఏటిఎం లో దీని సంఖ్యను తగ్గించాలి అనే డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేసారు.

ఆయన లోక్ సభ లో ఈ అంశం గురించి మాట్లాడుతూ… దేశంలో రెండు వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి తొలగించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్‌ లు రూ.500 నోట్లు, రూ.200 నోట్లు ఏటీఎంలో వచ్చేలా ఏటీఎంలలో కొన్ని మార్పులు తెస్తున్నాయని ఆయన వివరించారు. దేశంలో రూ.500, రూ.200 నోట్లకు డిమాండ్ బాగా పెరిగిందని అన్నారు.

రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నమాట వాస్తవమే అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే తాము ఆ నోట్ల బదులుగా, ఎక్కువ సంఖ్యలో రూ.500, రూ.200 నోట్లు ఏటీఎంలలో వచ్చేలా చేస్తున్నామని ఆయన వివరించారు. పూర్తిగా రూ.2000 నోట్లు రావని కాదని చెప్పారు. తక్కువ సంఖ్యలో వస్తాయని అన్నారు. ఇప్పటివరకు 7.40 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీని ముద్రించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news