వర్మకి ఊరట.. ‘మర్డర్‌’ సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలన్ని సంచలనం రేపుతున్నాయన్న విషయం తెలిసిందే. ఆయన అన్ని సినిమాలు వివాదాలు రేగుతాయని అనుకుంటారు కానీ వివాదాలనే వర్మ సినిమాలుగా తీస్తూ ఉంటారు. అందుకే టాలీవుడ్ లో వర్మ సినిమాలు సృష్టించే హడావిడి మరే సినిమా సృష్టించలేదు అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో అమృత భర్త ప్రణయ్ పరువు హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పరువు హత్య గురించి ఇప్పుడిప్పుడే అందరూ మరిచిపోతున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ ఈ స్టోరీని సినిమాగా తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమాని రిలీజ్ చేయకూడదని అమృత కోర్టుకెక్కింది. దీంతో మర్డర్‌ సినిమాపై నల్గొండ కోర్టు స్టే కూడా ఇచ్చింది. అయితే ఈ విషయంలోనే ఆయనకు ఊరట లభించింది. రామ్‌గోపాల్‌ వర్మ ‘మర్డర్‌’ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వర్మ మర్డర్‌ సినిమాపై హైకోర్టులో పిటిషన్‌ వేయగా మర్డర్‌ సినిమాపై నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను కొట్టి వేసింది హైకోర్టు. అయితే సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు వాడకూడదని షరతు విధించింది. దీంతో అమృత, ప్రణయ్‌ పేర్లు వాడమని చిత్ర యూనిట్‌ కూడా ఒప్పుకుంది.