సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ చైనాకు చెందిన యూట్యూబ్ చానళ్లకు షాకిచ్చింది. 2500 చైనీస్ యూట్యూబ్ చానల్స్ ను డిలీట్ చేస్తున్నట్లు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్న కారణంలో ఆ చానళ్లను డిలీట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్య కాలంలో ఆ చానల్స్ ను తీసేశామని గూగుల్ తెలిపింది.
ఇక ఈ విషయంపై విచారణ చేపట్టామని కూడా గూగుల్ తెలియజేసింది. చైనాతో సంబంధం ఉన్నట్లుగా చెప్పబడుతున్న సదరు చానల్స్ పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపింది. ఆయా చానళ్లలో ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని గూగుల్ పేర్కొంది. అయితే నిర్దిష్టంగా ఏయే చానళ్లను డిలీట్ చేసిందీ.. వాటి పేర్లను గూగుల్ వెల్లడించలేదు.
ఇక ఈ విషయంపై అమెరికాలోని చైనా ఎంబస్సీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా సదరు యూట్యూబ్ చానళ్లతో ఇరాన్, రష్యాలకు కూడా సంబంధం ఉండి ఉంటుందని గూగుల్ భావిస్తోంది. అయితే 2016 నుంచి ఫేస్‌బుక్ తోపాటు గూగుల్ కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాంటి యూట్యూబ్ యూజర్ల చానళ్లను గూగుల్ తొలగిస్తుండడంతోపాటు ఫేస్‌బుక్ కూడా ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. అయితే తాజాగా 2500 చానళ్లను గూగుల్ యూట్యూబ్ నుంచి తొలగించడం సంచలనం రేపుతోంది.