గూగుల్ కంపెనీలో జాబ్ రావడం అంటే.. చాలామంది అదృష్టంగా భావిస్తారు. ప్యాకేజీ ఆ రేంజ్‌లో ఉంటుంది మరీ..! అయితే గూగుల్ ఉద్యోగులు ఇది ఒకింత బ్యాడ్ న్యూస్. పనితీరు మెరుగుపరుచుకోకపోతే పీకేస్తాం అని నిర్మొహమాటంగా యాజమాన్యం చెప్పేసింది. పనితీరు మెరుగుపర్చుకొని అంచనాలను అందుకోలేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే అవకాశం ఉండదని గూగుల్ ఉద్యోగులను ఆ సంస్థ సీనియర్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల పనితీరుపై మదింపు నిర్వహించనున్నట్లు కంపెనీ సీనియర్ నాయకత్వం వెల్లడించింది. దీనిలో మొత్తంగా విక్రయాల్లో పురోగతి, సాధారణ పనితీరును అంచనావేయనున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల కనిపించకపోతే చర్యలు తప్పవని సేల్స్ టీమ్‌కు హెచ్చరికలు కూడా అందాయి.
మరోపక్క ఉద్యోగుల భయాలను మరింత పెంచేలా గూగుల్ నియామకాలను ఈ నెల కూడా నిలిపివేసింది. దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ నెల మొదట్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొందరు ఉద్యోగుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గూగుల్‌లో ఉత్పాదకత ఉండాల్సినంతగా లేదని ఆయన వివరించారు. పని కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువందనే అభిప్రాయం బాగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గూగుల్ ఆదాయం ఆశించినంతగా లేదు. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చడానికి ‘సింప్లిసిటీ స్ప్రింట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. లక్ష్యాలపై మరింత దృష్టిపెట్టేలా పని సంస్కృతిని తయారు చేసుకోవాలని సుందర్ ఉద్యోగులకు సూచించారు.
2023 నాటికి నియామకాలు, పెట్టుబడులను కుదించి ఉద్యోగుల నుంచి మరింత ఉత్పాదకత సాధిస్తామని సీఈవో అంటున్నారు. టెక్ కంపెనీల్లో గూగుల్‌తో పాటు చాలా సంస్థలు నియామకాలను తగ్గించాయి. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా పనితీరు సరిగాలేని ఉద్యోగులను వదిలించుకోవాలని చూస్తున్నారు. ట్విటర్ కూడా నియామకాలను నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు వెల్లడించారు. కరోనా దెబ్బకు ప్రముఖ కంపెనీలు ఇలా ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఉన్నవాళ్ల నుంచి ఉత్పత్తి పెంచే ఆలోచనలో ఉన్నాయి. దీని వల్ల ఉద్యోగులపై పని భారం మరింత పెరగనుంది.