అమెరికాలో సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6 నుంచి 6.23 గంటల మధ్య గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడైంది. ఈ మేరకు డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ యూజర్ల ఫిర్యాదు మేరకు ఈ విషయాన్ని పరీక్షించి ధ్రువీకరించింది.
దాదాపుగా 20 నిమిషాల పాటు గూగుల్ సేవలు నిలిచిపోయాయి. గూగుల్‌కు చెందిన జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్ సైట్లు అసలు ఓపెన్ కాలేదు. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న గూగుల్ వెంటనే సమస్యను పరిష్కరించింది. యూజర్లకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది.
కాగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే ఎక్కువగా యూజర్లకు గూగుల్ సేవలు లభ్యం కాలేదని తెలుస్తోంది. అలాగే గూగుల్‌కు చెందిన క్లౌడ్ సేవలను వాడే కార్పొరేట్ కస్టమర్లకే ఇబ్బంది కలిగినట్లు సమాచారం. అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అదే టైముకు గూగుల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. కానీ కేవలం అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్‌కు చెందిన పలు సర్వర్లు క్రాష్ అవ్వడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.