ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మూడోదశ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఈ మేరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ చేయాలని నిర్ణయించింది. స్పందన వెబ్‌సైట్‌లో పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ పాస్ జారీ చేయనున్నారు.
దరఖాస్తు చేసిన వెంటనే ప్రయాణికుడి మొబైల్, ఈ మెయిల్‌కు అధికారులు ఈ పాస్ పంపనున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఈ పాస్‌తో పాటు తగిన గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలో ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది. రేపటి నుంచి ఆటోమేటిక్ ఈ పాస్‌లు జారీచేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. చెక్ పోస్టుల వద్ద నమోదు చేసుకున్న ప్రయాణికుల వివరాలు ఆరోగ్యశాఖ ద్వారా స్థానిక సిబ్బందికి అధికారులు పంపనున్నారు. స్థానిక వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.