రాష్ట్ర గవర్నర్ తమను మోసం చేశారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని వారు తప్పుబట్టారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటంపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ తమను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారంటూ ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వెంటనే వారంతా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయాన్ని, న్యాయనిపుణుల సలహాలను తీసుకోకుండానే రాజ్యాంగ పదవిలో ఉండి ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు.