ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. క్షణాల్లో పిజ్జా ఇంటికి డెలివరీ అవుతుంది. అలాగే మొబైల్ ఫోన్లలో ఆర్డర్ చేస్తే కావల్సిన ఫుడ్ ఇంటికి వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన సేవలే. మన దేశంలో అనేక నగరాలు, పట్టణాల్లో ఈ తరహా సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇకపై ఢిల్లీ పౌరులకు ప్రభుత్వ సేవలు కూడా హోం డెలివరీ రూపంలో లభ్యం కానున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే అందజేసే డోర్ స్టెప్ డెలివరీ పథకాన్ని ఢిల్లీలో ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో వివరాలను వెల్లడించారు.
డోర్ స్టెప్ డెలివరీ పథకం ద్వారా ఢిల్లీ పౌరులకు 40 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ఇందుకు గాను పౌరులు 1076 నంబర్‌కు ఫోన్ చేయాలి. అనంతరం మొబైల్ సహాయక్‌లు పౌరుడి ఇంటి వద్దకు వచ్చి పౌరుడు అడిగిన సేవకు సంబంధించిన పత్రాలను సేకరిస్తారు. ఈ క్రమంలో అవసరం ఉన్న మేర సంబంధిత సేవకు చెందిన ప్రభుత్వ కార్యాలయానికి పౌరుడు ఒక్కసారి వెళితే చాలు. ఆ సేవ లభిస్తుంది. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే పైన సూచించిన నంబర్‌కు ఫోన్ చేస్తే వచ్చే మొబైల్ సహాయక్‌కు సంబంధిత పత్రాలను అందజేయాలి. అనంతరం సదరు సేవకు చెందిన శాఖ అధికారులు సూచించిన మేరకు ఒకసారి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసైతే చాలన్నమాట. ఇలా ప్రభుత్వ సేవలు లభిస్తాయి.
పాస్‌పోర్టు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, బర్త్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా పలు సేవలను ఢిల్లీ ప్రభుత్వం పౌరుల ఇంటి వద్దే అందిస్తోంది. ప్రస్తుతం 11 జిల్లాల్లో ఒక్కో కేంద్రానికి 5 మంది మొబైల్ సహాయక్‌లు పనిచేస్తుండగా వీరి సంఖ్యను త్వరలో పెంచనున్నారు. కాగా ఈ పథకం పట్ల కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆప్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చిందని, అయినా ప్రభుత్వం అందిస్తున్న 40 సేవల్లో ఇప్పటికే 35 రకాలకు పైగా సేవలు ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.