గ్రేటర్ లో గెలుపు,ఓటముల ప్రభావం ఏ పార్టీ పై ఎంత ?

-

జరుగుతున్నవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు… కానీ పార్టీల పోరాటం చూస్తుంటే చావో రేవో అన్నట్లుగా తలబడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ స్థానిక ఎన్నికకు పార్టీలు ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నాయి.మహానగర సమరాన్ని ఎందుకింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి… ఈ ఎన్నికల్లో ఓడితే నష్టం ఏంటీ గెలిస్తే వచ్చే లాభం ఏంటీ?

హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ చూడని ఎన్నికల ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. మామూలుగా అయితే ఇది హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నిక. కేవలం హైదరాబాద్‌లో నీళ్ళు.. డ్రైనేజీ.. రోడ్లు.. పారిశుద్ధ్యం.. వంటి వసతులపైనే గ్రేటర్ పాలకమండలి పనిచేస్తుంది. వాటి అభివృద్ధినే చూస్తుంది. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో 74 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రజాసేవ సంగతి అంటుంచితే, రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చోవారేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల ముందు జరుగుతుండటంతో.. గ్రేటర్ ఎన్నికలు పార్టీలన్నింటికీ కీలకంగా మారాయి.

ఐదు లోక్‌సభ స్థానాలు… 24 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 150 డివిజన్ల సమాహారమే గ్రేటర్‌ హైదరాబాద్‌. తెలంగాణకు రాజధాని. రాజకీయ కార్యక్షేత్రం.. రాష్ట్రంలో నాలుగోవంతు… ప్రజలకు ప్రతిరూపం. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారు ఉండటంతో… రాష్ట్రమంతటి… ప్రజాభిప్రాయంగానూ భావించవచ్చు. 119 సీట్లున్న అసెంబ్లీపైన ఈ ఎన్నికల తీర్పు ప్రభావం పడుతుందని అధికార, ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి.

పార్టీలకు ఈ ఎన్నికలు ఎందుకింత ప్రతిష్టాత్మకంగా మారాయో ఓ సారి పరిశీలిస్తే… టీఆర్ఎస్.. తెలంగాణ ఛాంపియన్. రెండుసార్లు గెలిచి.. ఆరేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌కు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మారుతోందా? అన్న అనుమానాలు అటు అధికారపార్టీలో.. ఇటు ప్రతిపక్షంలో మొదలయ్యాయి. ఈలోగా గ్రేటర్ ఎన్నికలు దూసుకొచ్చాయి. రాజధానిలో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి … తెలంగాణ ప్రజల నమ్మకం ఏమాత్రం తమపై చెరిగిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. గత గ్రేటర్ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో క్లీన్‌స్వీప్‌ చేసి 99 డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది గులాబీ పార్టీ. ఒక్కఅడుగులో సెంచరీని చేజార్చుకుంది. గతంలో గెలిచిన డివిజన్‌లన్నీ తిరిగి గెలిచి నగరం పై పార్టీ పట్టేమీ సడలిపోలేదని నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్‌ తహతహలాడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారడం రాజకీయంగా ఇబ్బంది అనుకుంటోంది. అందుకే కారుకు తప్ప మరో పార్టీకి చోటులేకుండా చూడటం టీఆర్‌ఎస్‌కు చాలా అవసరం.

గ్రేటర్‌ పోరులో బీజేపీ తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేఒక్క సీటుకు పరిమితమైన కమలనాథులు.. లోకసభ సమరానికి వచ్చేసరికి తెలంగాణలో నాలుగుచోట్ల గెలిచారు. దుబ్బాక ఉపఎన్నికల విజయం కమలనాథుల్లో మరింత ఉత్సాహం నింపింది. గ్రేటర్లోనూ గెలిచి.. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని చూపాలన్నది వీరి ప్లాన్. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ లేనంత దూకుడుగా వెళ్తొంది. అయితే బీజేపీకి కళ్లెం వేయడానికి టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. టార్గెట్ బీజేపీగా అధికార పార్టీ ప్రచారం సాగుతోంది. దుబ్బాక గెలుపు గాలివాటమే అని చూపాలన్నది అధికార పార్టీ వ్యూహం.

అయితే… కమలనాథులు ఈ ఎన్నికలను… టర్నింగ్‌ పాయింట్‌గా భావిస్తున్నారు. దుబ్బాకను లాంఛ్‌ప్యాడ్‌గా చేసుకొని … గ్రేటర్‌లో రాకెట్‌లా దూసుకుపోయి.. అసెంబ్లీని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీస్థాయి నేతలంతా హైదరాబాద్‌ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కాకుంటే.. ఇంకెప్పుడూ కాదు అనేది బీజేపీ గట్టిగా నమ్ముతోంది. గ్రేటర్‌లో గెలిస్తే.. తెలంగాణను గెలిచేయడం ఈజీ అన్నది ఆ పార్టీ వేసుకుంటున్న లెక్క. దానికోసమే ఎప్పుడూ వినపడని విమర్శలు కమలనాథుల నుంచి వస్తున్నాయి.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడింది. దుబ్బాకలో డిపాజిట్ రాని పరిస్థితి. దుబ్బాకలో బీజేపీ గెలుపు… అధికార టీఆర్ఎస్ ఓటమి.. కాంగ్రెస్ పార్టీకి సంతోషాన్ని ఇచ్చింది. అదే సమయంలో తమ పార్టీని కనీస ప్రత్యామ్నాయంగా కూడా జనం చూడకపోవడం నేతలను ఆందోళనలో పడేసింది. దుబ్బాక ఓటమికి పోస్ట్‌మార్టం చేసుకోకముందే.. గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అభ్యర్థుల ఎంపిక సరే, అసలు పార్టీ సీనియర్ల మధ్యే ఏకాభిప్రాయం లేకపోయింది. కమిటీలగోల చివరివరకూ నడిచింది. అన్ని సర్దుకొని 146 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించినా.. వారిని గెలిపించుకొని సత్తా చాటాలి. బీజేపీతో పోలిస్తే చాలామంది అగ్రనేతలు ఉన్న కాంగ్రెస్‌కు గ్రేటర్ గెలుపు అత్యవసరం. మూడేళ్లలో వచ్చే ఎన్నికలకు పార్టీ కోలుకోవాలంటే గ్రేటర్ బూస్ట్ కావాలి. అందుకే … టీఆర్ఎస్, బీజేపీతోపాటు కాంగ్రెస్‌కూడా హోరాహోరీ తలపడుతుంది.

ఇక పాత నగరంలో తమ పట్టు ఏమాత్రం సడలిపోలేదని… నిరూపించుకోవాలనుకుంటుంది ఎంఐఎం. హైదరాబాద్ పార్టీ.. ఉత్తరాదిలో దుమ్ము దులిపింది. బీహార్ ఎన్నికల్లో ఐదు చోట్ల విజయం సాధించింది. అలాంటిది .. పాతబస్తీ కా షేర్ అని పేరున్న ఎంఐఎంకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఓ వైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ … తమ స్థానాల్లో పాగా వేయాలని చూస్తుండటంతో… ఉన్న డివిజన్లు ఏవీ చెదిరిపోకుండా… జాగ్రత్తపడుతోంది. అందుకే గత ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేసి 44 సొంతం చేసుకున్న మజ్లీస్‌ ఈసారి కేవలం 51స్థానాల్లోనే బరిలోకి దిగింది. వాటిల్లోనే గెలిచేందుకు పక్కా వ్యూహంతో ముందుకుపోతుంది. ఎంఐఎంకు కమలంతో ఉన్న కయ్యం ఈనాటిది కాకున్నా.. ఈసారి బీజేపీ దూకుడు అసద్ సోదరులను అప్రమత్తం చేసినట్లు కనిపిస్తోంది. ఓల్డ్‌ సిటీలో కమలానికి చోటులేకుండా చూడటం పతంగ్‌ పార్టీకీ అత్యవసరంగా మారింది. ఇలా పార్టీలన్నీ తమ తమ రాజకీయవ్యూహాలతో గ్రేటర్‌ సమరంలో తలపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version