GST Council Meeting: సామాన్యులకు మరోసారి నిరాశ ఎదురైంది. కేంద్రప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రో ఉత్పత్తులను వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకోవస్తుందని ఆశగా చూసిన సామాన్య పౌరులకు మరోసారి మొండి చేయి చూపించింది. శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ 45 సమావేశం లక్నో వేదికగా జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రుల సమక్షంలో అనేక కీలక అంశాలపై చర్చించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చారు. కానీ.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి వెల్లడించింది.
కానీ, బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వివరించారు.
ఈ సమావేశంలో మరో కీలక అంశంపై నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఔషధాలపై తగ్గింపు డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఈ మెడిసిన్ పై
సెప్టెంబర్ 30 వరకు మాత్రమే తగ్గింపు ఉంది. ఈ నిర్ణయంతో కరోనా పేషంట్లకు ఊరట లభించింది. అలాగే, క్యాన్సర్ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు.
ఎవ్వరూ ఊహించని విధంగా ..స్విగ్గీ, జొమాటోలను కూడా జీఎస్టీ పరిధికిలోకి తీసుకవచ్చారు. కానీ వినియోగదారులపై కొత్తగా ఎలాంటి పన్నూ వేయడం లేదన్నారు. అదే సమయంలో గతంలో సంబంధిత రెస్టారెంట్ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లించాలని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.