18 రోజుల క్రితం తుపాకీని పట్టుకున్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అనంతనాగ్ లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ లో భారత భద్రతా దళాలు కాల్చి చంపాయి. కుల్గాం నివాసి అయిన 20 ఏళ్ళ షాహిద్ ఖార్ జనవరి 9 నుండి కనపడకుండా పోయాడు. ఆ తర్వాత అతను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. సైనికులే లక్ష్యంగా దాడులు చేయడానికి సిద్దమయ్యాడు.
ఈ నేపధ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఒక జవాన్ కి గాయాలు అయ్యాయి… అనంతనాగ్ జిల్లాలోని అర్వానీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేయగా ఉగ్రవాదులు తారస పడ్డారు. భద్రతా దళాలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.
ఖార్ ని లొంగిపోవాలని భద్రతా బలగాలు కోరినా అందుకు అతను నిరాకరించడంతో అతన్ని కాల్చి చంపారు. దీనిపై స్పందించిన అధికారులు, ఉగ్రవాదులుగా మారిన తర్వాత వారి జీవితం కేవలం ఒకటి లేదా రెండేళ్ళు అని కానీ షాహిద్ కొత్త వాడని, మేము అతనికి లొంగిపోవడానికి అవకాశం ఇచ్చామని, దురదృష్టవశాత్తు, అతను ఎకె 47 తో కాల్పులు జరపడంతో పాటుగా మూడు గ్రెనేడ్లు ఉపయోగించాడని అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత సైన్యంపై రాళ్ళ దాడి జరిగింది.