బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇంటి వ‌ద్ద కాల్పులు

బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ త‌న ఇంటి వ‌ద్ద ఎవ‌రో కాల్పులు జ‌రిపార‌ని ఫిర్యాదు చేసింది. మ‌నాలిలోని త‌న ఇంటి స‌మీపంలో శుక్ర‌వారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో రెండు సార్లు గ‌న్ షాట్స్ విన‌బ‌డ్డాయ‌ని కంగ‌నా తెలిపింది. 8 సెక‌న్ల వ్య‌వ‌ధిలో రెండు సార్లు కాల్పులు జ‌రిపార‌ని తెలిపింది. బ‌య‌ట‌కు వెళ్లి త‌న సెక్యూరిటీ గార్డును ఇదే విష‌య‌మై చెక్ చేయ‌మ‌ని చెప్పాన‌ని, అయితే ఇంటి ప‌క్క‌న ఉన్న‌వారు త‌మ‌కేమీ తెలియ‌ద‌ని బ‌దులిచ్చార‌ని కంగ‌నా తెలిపింది. ఇక ఇదే విష‌య‌మై ఆమె స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వారు ఆమె ఇంటి వ‌ద్ద పోలీసు బందోబ‌స్తు పెట్టారు.

gun shots fired at kangana ranaut residency in manali

సువాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసులో కంగ‌నా ర‌నౌత్ మొద‌ట్నుంచీ బాలీవుడ్‌లో ఉన్న బంధు ప్రీతిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంది. బాలీవుడ్ పెద్ద‌లు సుశాంత్‌ను బెదిరించార‌ని, అత‌ని కెరీర్‌ను దెబ్బ తీసే య‌త్నం చేశార‌ని, అందుక‌నే అత‌ను మ‌న‌స్థాపానికి గురై చ‌నిపోయాడ‌ని కంగ‌నా ప‌దే ప‌దే ఆరోపిస్తూ వ‌స్తోంది. ఇక తాజాగా ఆమె మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక‌రేను ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న్ను పెంగ్విన్ అని సంబోధించింది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీకి చెందిన ప‌లువురు త‌న ఇంటి వ‌ద్ద కాల్పులు జ‌రిపి త‌న‌ను భ‌య పెట్టాల‌ని చూశార‌ని కంగ‌నా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

సుశాంత్ సింగ్‌ను కూడా వారు అదే ర‌కంగా భ‌యపెట్టి ఉంటార‌ని కంగ‌నా ఆరోపించింది. ఏడెనిమిది వేల రూపాయ‌లు ఇస్తే గూండాలు ఎవ‌రైనా వ‌చ్చి ఇలా భ‌య‌పెడతార‌ని కంగనా పేర్కొంది. ఇలాంటి బెదిరింపుల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని స్ప‌ష్టంగా తెలిపింది. సుశాంత్ సింగ్ కుటుంబానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని తెలిపింది. త‌న ఇంట్లో త‌న రూంకు ఎదురుగా ఉన్న ప‌క్క ఇంట్లో త‌న‌కు గ‌న్ షాట్స్ విన‌బ‌డ్డాయ‌ని, తాను స్ప‌ష్టంగా ఆ శ‌బ్దాల‌ను విన్నాన‌ని కూడా కంగనా పేర్కొంది.