మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్, బాపట్ల జిల్లాలో పదో తరగతి బాలుడు అమర్నాథ్ సజీవదహనం తదితర పరిణామాలపై స్పందించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. బాపట్ల జిల్లాలో విద్యార్థి హత్య ఘటన అమానుషం అని పేర్కొన్నారు. అమర్నాథ్ అనే పిల్లవాడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం హృదయాన్ని కలచివేసిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు సామాన్యులకు భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ, రాష్ట్రంలో శాంతిభద్రతలకు లోటు లేదని, అంతా బాగుందని డీజీపీతో సీఎం జగన్ చెప్పించడం సిగ్గుచేటని జీవీఎల్ మండిపడ్డారు. అక్కను వేధిస్తుండడంతో అడ్డుకున్న ఆ బాలుడ్ని సజీవదహనం చేయడం రాక్షసులు కూడా సిగ్గుపడే చర్య అని అభివర్ణించారు. తన అక్క ఎదుర్కొంటున్న వేధింపులను ఒక చిన్న పిల్లవాడు అడ్డుకున్నాడని మీ కార్యకర్త పాశవిక చర్యకు పాల్పడడం చూస్తుంటే మీరు వారిలో ఏ స్థాయిలో రాక్షస మనస్తత్వాన్ని నింపారో అర్థమవుతోందని సీఎం జగన్ ను జీవీఎల్ విమర్శించారు. ఆ విద్యార్థి కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.