ఆంధ్రప్రదే లో ఓపైవు పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం దుమారం రేపుతోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు హడావిగా ఆందోళనలు చేస్తున్నా అధికార వైసీపీకి మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుంది.పల్లె పోరు తర్వాత ఏ క్షణమైనా కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశముండటంతో జీవీఎంసీ ఎన్నికల పై దృష్టిపెట్టింది వైసీపీ ఈలోపే స్టీల్ ప్లాంట్ వ్యవహారం సెంటిమెంట్ గా మారుతుండటతో విశాఖ వైసీపీ శ్రేణులకు కొత్త టెన్షన్ పట్టుకుంది.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు అధికార వైసీపీ రెడీ అవుతోంది. గెలుపుగుర్రాలను రెడీ చేసుకుంటున్న పార్టీ.. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పోటీలో నిలిచేందుకు రెడీగా ఉండాలని పార్టీ శ్రేణులకు వారం క్రితమే దిశానిర్దేశం చేసింది. మార్చి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే అంచనాలతో ముందునుంచే కసరత్తు ప్రారంభించింది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్, ఏపీలోని అతిపెద్ద నగరమైన జీవీఎంసీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 98స్థానాలు కలిగిన జీవీఎంసీలో 90స్థానాలు దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు స్థానిక నాయకత్వం సమన్వయంతో విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కార్యాచరణ సిద్ధంచేస్తోంది. గాజువాక, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలు ఎమ్మెల్యే, కన్వీనర్లతో సమావేశాలు సైతం ఏర్పాటు చేసింది. అభ్యర్ధుల పై ఇదివరకే క్లారిటీ ఉండటం ఆగినచోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందనే గట్టి నమ్మకం వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే నియోజక వర్గాలకు పరిశీలకుల నియామకం చేపట్టింది. భీమిలికి మాజీ మంత్రి పి.బాలరాజు, మిగిలిన నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్యేలను పర్యవేక్షకులుగా నియమించింది. విశాఖ పరిపాలనా రాజధాని కానుండటంతో మేయర్ పదవిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలుపు తప్పనిసరని పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చాలా మంది ఏడాది క్రితమే హెచ్చరించారు. అయినా అప్పుడు నోరెత్తకుండా పార్టీలన్నీ ఏమీ తెలియనట్లు నటించాయి. ఇప్పుడు ప్రైవేటీకరణ కసరత్తు ప్రారంభం కాగానే…లబోదిబోమంటూ నేతలు గొంతు చించుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి ఓ కార్యాచరణ అంటూ ప్రకటించకుండా… అవసరమైతే రాజీనామాలు చేస్తాం… ఇంకా అవసరమైతే ప్రాణత్యాగాలు చేస్తామంటూ డైలాగులు పేల్చుతున్నారు. విశాఖ కార్పోరేషన్ ఎన్నికల వేళ ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.