దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపుతున్న జ్ఞానవాపీ మసీదు వివాదంపై ఈ రోజు వారణాసి ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఏకే విశ్వేషా విచారణ జరిపారు. కాశీ విశ్వనాథ దేశాలయం-జ్ఞానవాపీ మసీదు కేసులో సివిల్ దావాను విచారించారు. ఈ రోజు జరిగిన వాదనకు సంబంధించి 19 మంది న్యాయవాదులను, నలుగురు పిటిషనర్లతో సహా 23 మంది మాత్రమే పోలీసులు కోర్ట్ లోకి అనుమతించారు. అయితే ఈ వివాదంపై ఇరు పక్షాల వాదనలను వారణాసి కోర్ట్ విన్నది. వాదనలు పూర్తయిన తరువాత కోర్ట్ తన నిర్ణయాన్ని రేపటికి రిజర్వ్ చేసింది. జ్ఞానవాపీ మసీదు వివాదంపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే సుప్రీం కోర్ట్ జ్ఞానవాపీ మసీదు వివాదాన్ని వారణాసి జిల్లా కోర్ట్ కు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి సివిల్ కోర్ట్ నియమించిన కోర్ట్ కమిషనర్లు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేశారు. ఈ వీడియో సర్వేలో మసీదులోని ‘ వాజూ ఖానా’లోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో సుప్రీం కోర్ట్ శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాల్సిందిగా వారణాసి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇదే విధంగా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.