మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో చలి విపరీతంగా పెట్టిన సంగతి తెలిసిందే. పొద్దున లేస్తే మంచు కురవడం, చల్లటి గాలులతో ప్రజలు ఇబ్బంది పడేవారు. అయితే ఇప్పుడు ఇప్పుడు చలి తగ్గిపోయింది. మహాశివరాత్రి ముగియడంతో… ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
ఈ ఏడాది ఎండాకాలంలో ఏప్రిల్ నెల ఆఖరు నుంచే వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు కావచ్చు అని తెలిపింది.
ఏప్రిల్ మాసం లో 40 నుంచి 45 డిగ్రీలు అలాగే మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ వేసవిలో అక్కడక్కడ అకాల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. అయితే వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.