పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా ఏ పని అయినా చేయవచ్చు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధించి తీరవచ్చు. అందుకు ఆ విద్యార్థే ఆదర్శంగా నిలుస్తున్నాడు. రెండు చేతులు లేకపోయినా.. ఓ వైపు పేదరికం బాధిస్తున్నా.. చదువుల్లో మాత్రం తాను టాప్ అని నిరూపించాడు. అస్సాంకు చెందిన అబ్దుల్ మజిద్ అలీ ఇటీవల అక్కడ ప్రకటించిన హెచ్ఎస్ఎల్‌సీ పరీక్షల్లో 86 శాతం ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
అబ్దుల్ మజిద్ అలీకి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ చదువుకోవాలనే కోరిక ఉండేది. దీంతో అతని తల్లి అతనికి సహాయం చేసింది. పెన్నులను ఎలా పట్టుకుని రాయాలో నేర్పించింది. ఈ క్రమంలోనే అతను ఇప్పుడు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తున్నాడు. ఇతని తండ్రి ఓ దినసరి కూలీ. అయినా.. పేదరికం, అంగవైకల్యం మజిద్‌కు అడ్డుకాలేదు. కష్టపడి చదివాడు. ఇక ఇతను పరీక్షలు రాసేందుకు అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు.
మజిద్ అందరిలానే రాయగలడు. కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకనే సాధారణ పరీక్షా సమయం 3 గంటలు కాగా.. ఇతనికి ఎగ్జామ్ రాసేందుకు 4 గంటల సమయం పడుతోంది. అందుకనే ఇతన్ని ప్రత్యేకంగా వేరే గదిలో ఉంచి పరీక్షలు రాయించారు. అలాగే ఆన్సర్ షీట్లు తిప్పేందుకు, వాటిని దారంతో కట్టేందుకు అతనికి ఓ సహాయకున్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో మజిద్ ఎగ్జామ్స్ రాసి ఎట్టకేలకు ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు.
ఇక మజిద్ ఏమంటాడంటే… ఎల్లప్పుడూ వీల్ చెయిర్‌కే పరిమితమై, కనీసం మాటలు కూడా మాట్లాడేందుకు కూడా వీలు లేని జీవితం గడిపిన ప్రముఖ సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్ తనకు ప్రేరణ అని చెప్పాడు. తాను డాక్టర్ అవుదామనుకుంటున్నానని అన్నాడు. కాగా మజిద్ ఇప్పటి వరకు తన వైకల్యానికి సంబంధించి ఏ డాక్టర్‌నూ కలవలేదు. కారణం.. డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకునేందుకు కావల్సిన డబ్బు అతని కుటుంబం వద్ద లేదు. ఈ క్రమంలోనే తనను ఆదుకునే దాతల కోసం అతను ఎదురు చూస్తూనే.. మరోవైపు తన లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నాడు. అతని కలలు నిజం కావాలని కోరుకుందాం.