సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం.. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. రేపు సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని.. లక్ష మందితో ఈ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకు నోటు కేసుతో ఫేమస్ అయ్యారు.. ఇప్పుడు సీటుకు నోటుతో ఫేమస్ అవుతున్నారని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి డబ్బులకు కాంగ్రెస్ పార్టీ టికెట్‌లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాది మేకపోతూ గాంభీర్యమని ఎద్దేవా చేశారు.
నమ్మకానికి మారుపేరు కేసీఆర్.. నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో కాపీ కొట్టింది.. మేము కాదు మీరేనని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఇలాంటి నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. పార్లమెంట్ లో తెలంగాణ ప్రభుత్వ పని తీరును ప్రశంసించి అధికారులే.. ఓట్ల కోసం తెలంగాణ గల్లీల్లో వచ్చి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. మీరు గతంలో చెప్పిన మాటలు నిజమా ఇప్పడు ఓట్ల కోసం తెలంగాణ గల్లీల్లో వచ్చి మా పథకాలను తిడుతున్నది నిజమా తేల్చి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. మరి తెలంగాణ పథకాలకు ఎందుకు అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు అమాయకులు కాదని.. అన్ని గమనిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఏది ఏమైనా మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాటిక్ కొడతారని.. ప్రజలంతా తమ పార్టీవైపే ఉన్నారని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.