తెలంగాణా మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన నియోజకవర్గంలో ఉన్న వలస కూలీలు అందరికి కూడా తాను మూడు కళ్యాణ మండపాలను, ఇతర ఫంక్షన్ హాల్స్ ని అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. వాళ్లకు ఆర్ధిక సహాయ౦తో పాటుగా వాళ్లకు అవసరమైన వస్తువులను, తినడానికి తిండి, లాక్ డౌన్ తర్వాత ఏదోక పని కల్పించే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు సమాచారం.
సిద్ధిపేట నియోజకవర్గంలో ఎంత మంది వలస కూలీలు ఉన్నారు, వాళ్ళు ఏయే రాష్ట్రాలకు చెందిన వారు, మహిళలు ఎంత మంది, పిల్లలు ఎంత మంది, వృద్దులు ఎంత మంది, మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇలా ప్రతీ ఒక్క వివరాన్ని ఆయన సేకరించే పనిలో పడ్డారు. ఇందుకు గానూ ఆయన నియోజకవర్గంలో ఉన్న రెవెన్యు అధికారుల సహకారం తీసుకుని జాబితాను సిద్దం చేస్తున్నారట.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పూర్తిగా అన్ని సౌకర్యాలు కల్పించి అవసరం అయితే లాక్ డౌన్ అయిపోయిన తర్వాత భారీగా వాహనాలను కేంద్ర అనుమతి తీసుకుని సొంత రాష్ట్రాలకు తరలించాలి అని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన అన్ని విధాలుగా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణ మండపాలను తీసుకున్న తర్వాత వలస కూలీలు అందరిని సామాజిక దూరం పాటిస్తూ అక్కడికి చేర్చాలని భావిస్తున్నారు.