కాంగ్రెస్ నేత ప్రతాప్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంటేరును ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒంటేరు ప్రతాప్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదనుకుంటా…చూడబోతుంటే ఆయనకు పిచ్చేక్కినట్లే అనిపిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటేరు ఆరోపణల్ని హరీశ్ తీవ్రంగా ఖండించారు. తన పుట్టుక.. చావు తెరాసలోనేని స్పష్టంచేశారు. బతికినంతకాలం తెరాసలోనే కొనసాగుతానన్నారు.. విలువలు, విశ్వసనీయత లేని ఆయన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఓటమి భయంతో ఏదో విధంగా జనాధరణ పొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు. ‘‘గజ్వేల్ ప్రజలు తెలివైనవారు. వాళ్లకు నీ సంగతి తెలిసిపోయింది. ఒక సర్పంచి, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయావు. ఈ ఎన్నికల్లోనూ ఏం చేయలేవు.
ప్రజలే బుద్ధి చేబుతారు…
ప్రతాప్ రెడ్డి ఎన్నినాటకాలు ఆడినా నేను ఇక్కడే ఉంటా… ఒంటేరుకి డిపాజిట్ గల్లంతయ్యాకే నేను ఇక్కడి నుంచి వెళ్తా అంటూ శపథం చేశారు. గజ్వేల్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఒంటేరుకి బుద్ధిచేబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటూ పేర్కొన్నారు. ఇప్పటికైనా పనికిరాని మాటలు మాని నీతినియమాలతో కూడిన రాజకీయం చేయండి. రాబోయేది తెరాస ప్రభుత్వమే అది కేసీఆర్ నాయకత్వంలోనే అంటూ ధీమా వ్యక్తం చేశారు.