తాజాగా టీడీపీలో పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జులుగా చాలా మంది కీలక నేతలను చంద్రబాబు నియమించారు. పార్టీకి అంకిత భావం ప్రదర్శించిన నాయకులు, పార్టీ పట్ల విధేయత చూపించిన నాయకులు, ముఖ్యంగా తన నాయకత్వాన్ని ప్రశ్నించని నాయకులకు ఆయన చక్కనిఅవకాశం కల్పించారు. అయితే ఈ కూర్పు బాగానే ఉన్నప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులను సవాలుగా తీసుకుని ముందుకు సాగడం అనేది ఇప్పుడు బాధ్యతలు తీసుకునే నాయకుల వల్ల సాధ్యమయ్యేనా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గం మచిలీపట్నం. ఇక్కడ మాజీ ఎంపీ.. కొనకళ్ల నారాయణకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఆయన దూకుడు చూపించి.. పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సి ఉంటుంది. అయితే, దీనికి ఆయన సమర్ధుడేనా? అనేది ప్రధాన ప్రశ్న. ఈ నియోజకవర్గం పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు వున్నాయి.
ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల దూకుడు మామూలుగా లేదు. ఇక, పెడన, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి… అధికార పార్టీతో కలిసి ముందుకు సాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయాలంటే.. కొనకళ్ల నారాయణకు అంత ఈజీకాదని.. ఇది ఆయనకు ముసళ్ల పండగ లాంటిదే అంటున్నారు.
పైగా ఆయన మాట వినే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వివాదరహితుడే అయినా.. దూకుడు, వ్యూహాలు వేయగలిగే నాయకుడుగా ఆయన పేరు లేకపోవడం గమనార్హం. గుడివాడలో వైసీపీ నాయకుడు , మంత్రి కొడాలినాని దూకుడును తట్టుకునే స్థాయిలో మంత్రాంగం సిద్ధం చేయాలి. గన్నవరంలో వంశీ పార్టీని వీడిపోయారు. ఇక్కడ కూడా ఆయనకు ధీటుగా పార్టీని నిలబెట్టేలా చూడాలి. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అనేక సవాళ్లు ఉన్నాయి. కానీ, కొనకళ్ల రాజకీయాలు ఈ దూకుడుకు తగిన విధంగా ఉండబోవనేది విశ్లేషకుల మాట. మరి ఏం చేస్తారో చూడాలి.
-Vuyyuru Subhash