దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డే ఆద్వర్యంలోని ధర్మాసనం, తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. యూపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ హత్రాస్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందని ఇక న్యాయ సహాయ విషయంలో ఇప్పటికే ప్రైవేటు న్యాయవాదులు స్వచ్చందంగా బాధిత కుటుంబం తరపున ఉన్నారని పేర్కోన్నారు.
ఇక కేసు విచారణను అలహాబాద్ హైకోర్టే చేస్తుందన్న చీఫ్ జస్టిస్ విచారణలో తమ పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఇక ఈ కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని బాధిత కుటుంబం తరపు న్యాయవాది కోర్టును కోరారు. స్టేటస్ రిపోర్ట్ ను సీబీఐ నేరుగా యూపీ ప్రభుత్వానికి కాకుండా సుప్రీంకోర్టు సమర్పించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆ స్టేటస్ రిపోర్టు నేరుగా కోర్టుకు సమర్పించడంలో అభ్యంతరం లేదని యూపీ ప్రభుత్వం తెలిపింది.