హైదరాబాద్ పోలీసులకు చేతులు ఎత్తి మొక్కాలి…!

-

హైదరాబాద్ మీద కనీస అవగాహన ఉన్న వాళ్లకు అయినా సరే అక్కడ ఉండే పేదల గురించి తెలిసే ఉంటుంది. వేలాది మంది రోడ్ల పక్కన బిచ్చం ఎత్తుకుంటూ కనపడుతూ ఉంటారు. ప్రతీ రోజు వందల మంది అక్కడ ఆకలితో ఒక్క ముద్ద ఉంటే చాలు మాకు పెట్టండి అని కోరుతూ ఉంటారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాళ్లకు అండగా నిలిచే వాళ్ళు లేకపోయారు. వాళ్ళ వద్ద డబ్బులు ఉన్నా సరే కొనుక్కుని తినే పరిస్థితి లేదు.

అందుకే హైదరాబాద్ పోలీసులు వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేస్తూనే… ప్రతీ రోజు 20 నుంచి 25 వేల మందికి అన్నం పెడుతున్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ముందు చూపుతో వాళ్ళ ఆకలి తీర్చే కార్యక్రమం మొదలుపెట్టారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 31 ప్రాంతాల్లో పేదలు, వలస కార్మికులు, అనాథలు ఆకలి కేకలతో నరకం చూస్తున్నారని పోలీసులకు అర్ధమైంది.

దీనితో వారి అందరికి అన్నం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్‌ పోలీస్ తో పాటుగా సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) రామకృష్ణ మిషన్‌ సహా కొన్ని సంస్థలు తమ వంతు సాయం చేయడానికి ముందుకి వచ్చాయి. వంద మంది వాలంటీర్లు పోలీసులకు సహకరించడానికి స్వచ్ఛందంగా తమ వంతు సహకారం అందించడానికి ముందుకి రావడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ప్రారంభంలో దాతల సహకారంతో ప్రతీ రోజు… 3000 మందికి భోజన ఏర్పాట్లు చేయగా ఇప్పుడు ఏకంగా 25000 మందికి అందిస్తున్నారు. 6 డీసీఎంలు, 14 బొలెరో వాహనాలను ఇందుకోసం వాడుతున్నారు. అందుకు 60 మంది వలంటీర్లు తమ వంతు సహకారం అందిస్తున్నారు. మార్చి-24 నుంచి ఏప్రిల్‌-12 వరకు మొత్తం 2.60 లక్షల మంది ఆకలి తీర్చారు పోలీసులు. అంతే కాదు పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. వైద్య సదుపాయం అందని వారికి పోలీసు వాహనలతోనే సహకారం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version