బీజేపీ నేతలకు అధికారం పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలోనే ఇది తెలిసిపోయిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలు, రైతు సమస్యలు కాకుండా పార్టీ సమస్యల పై చర్చించారని విమర్శించారు. అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణ రాష్ట్ర రైతుల సమస్యల గురించి ఒక్కసారి అయినా చర్చించారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కేసీఆర్ ను గద్దే దించి తమ పార్టీ గద్ధే ను ఎక్కడానికి వ్యూహాలు రచించారే తప్ప రైతుల గురించి ఆలోచించలేరని అన్నారు.
రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే అమిత్ షా తో యాసంగి వడ్ల కొనుగోలు.. జాతీయ ప్రాజెక్ట్ పై ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు విషయంలో రాష్ట్ర బీజేపీ, కేంద్ర బీజేపీ ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. యాసంగి వరి ధాన్యంపై లిఖిత పూర్వకం గా హామీ ఇవ్వాలని అన్నారు. అలాగే రాష్ట్ర రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గందోరగోళం చేస్తున్నారని అన్నారు. యాసంగి వడ్ల పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.