దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత తరుణంలో బ్యాంకు మోసాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు సూచించింది. అందులో భాగంగానే ఓ వినూత్న కార్యక్రమానికి హెచ్‌డీఎఫ్‌సీ శ్రీకారం చుట్టింది.
#MoohBandRakho పేరిట హెచ్‌డీఎఫ్‌సీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైబర్ మోసాల పట్ల ఖాతాదారుల్లో అవగాహనను కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. కొందరు నేరగాళ్లు బ్యాంకు హెల్ప్ లైన్ నంబర్ అంటూ ఫేక్ నంబర్ల నుంచి ఖాతాదారులకు ఫోన్లు చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ ఈ వివరాలను ట్వీట్ ద్వారా వెల్లడించింది.
మీ బ్యాంకు ఖాతాలో ఎఫ్‌డీ, ఆర్‌డీ ట్రాన్సాక్షన్ అయింది, మీరు చేయలేదు కదా, వెంటనే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వివరాలను చెప్పండి. అలాగే మెసేజ్‌లో ఇచ్చిన స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు తెలపండి.. అంటూ హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో అది నిజమే అని నమ్మిన ఖాతాదారులు తమ వివరాలను తెలియజేసి మోసపోతున్నారు. కనుక అలాంటి మెసేజ్‌లు, ఫేక్ హెల్ప్‌లైన్ నంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ సూచించింది.