చాలా రకాల మలుపులు, ట్విస్టుల తర్వాత అందరూ అనుకున్నట్టుగానే ఈటల రాజేందర్ వ్యవహారం ఎట్టకేలకు క్లైమాక్స్‌కు వచ్చింది. ముందుగా ఊహించిన విధంగానే ఈ రోజు ఆయన తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎగరేశారు. షామీర్‌పేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి, అనేక విషయాలను వెల్లడించారు.
అయితే ఇక్కడే ఆయన ఒక ట్విస్టు ఇచ్చారు. మొన్నటి వరకు మూడు రోజులు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలను కలిసిన ఆయన.. ఆ పార్టీలో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ ఈరోజు జరిపిన ప్రెస్‌మీట్‌లో మాత్రం ఈటల బీజేపీలో చేరికపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం బీజేపీ పేరు కూడా ఎత్తలేదు. దీంతో కమల నాథులు టెన్షన్ పడుతున్నారు.
తాము ఢిల్లీ పెద్దలను ఒప్పించి మరీ అపాయింట్ మెంట్ ఇప్పిస్తే ఈటల బీజేపీలో చేరికపై క్లారిటీ ఇవ్వకపోవడమేంటని రాష్ట్ర బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ నెల 7తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈటల రాజేందర్ చెప్పడం ఇప్పుడుహాట్ టాపిక్‌గా మారింది. ఇంకోవైపు తనతో వచ్చే వారిని తన వర్గంలో చేర్చుకుంటానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు జరిపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. దీంతో ఆయన 7తర్వాత అయినా బీజేపీలో చేరుతారా లేదా అని బీజేపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. తాము అన్ని చర్చలు జరిపిన తర్వాత ఆయన ఇలా చేయడమేంటని అంతర్మథనంలో పడ్డారు కమలనాథులు.