తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆంధ్రా ప్రజలకు అదిరిపోయే షాక్ తగిలింది. విమాన చార్జీలకు ‘విజయ దశమి’ రెక్కలొచ్చాయి. విపరీతమైన డిమాండ్.. రైళ్లలో బెర్తులు లేకపోవడం.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. వెరసి విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో నాలుగు అంకెల్లో ఉండాల్సిన విమాన చార్జీలు ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి ఐదు అంకెలకే చేరిపోయాయి. సాధారణ చార్జీలకంటే పది రెట్లు పైపైకి ఎగబాకాయి.
ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాలలో టిక్కెట్ల రేట్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఎంత దారుణం అంటే ముంబై – హైదరాబాద్‌కు విమానం టికెట్ ధర కనిష్ఠంగా రూ. 2,177.. గరిష్ఠంగా రూ. 3వేలుగా ఉంది. ఢిల్లీ – హైదరాబాద్ విమాన చార్జీలు కూడా రూ. 4వేలకు అటూఇటుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం – హైదరాబాద్‌కు వస్తున్న ఫ్లైట్లలో టికెట్ రేటు అక్షరాలా పాతిక వేలు.
ఇక్క రాజమహేంద్రవరం నుంచి వచ్చే ఫ్లైట్లలోనే కాదు.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన ఏపీ ప్రజలు ఇప్పుడు తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చే రైళ్ల బెర్తులు నిండిపోవడం.. బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇప్పుడు వారంతా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. కొన్ని సర్వీసులకు అసలు టిక్కెట్ దొరకని పరిస్థితి.
విజయవాడ-హైదరాబాద్ సర్వీసుల ధరలూ మోతమోగుతున్నాయి. సాయంత్రం వేళల్లో అయితే ఈ రూట్లో టిక్కెట్ ధర రూ. 18,886గా పలికింది. విశాఖ-హైదరాబాద్ మధ్య విమానం టికెట్ ధర రూ. 12 వేలుగా నమోదైంది. తిరుపతి-హైదరాబాద్ విమానాల్లో అత్యధికంగా రూ. 8వేల వరకు పలికింది. దీనిని బట్టి తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఏపీ ప్రజలకు ఎలా చుక్కలు చూపిస్తుందో అర్థమవుతోంది.