ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి సమయంలో మొన్న సాయంత్రం తీరం దాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తుఫాన్ క్రమంగా బలహీన పడుతోంది.పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తున్న తుఫాన్ మరింత బలహీన పడిందని ఐఎండీ స్పష్టంచేసింది. దీని ప్రభావంతో ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. కాళంగి, ఆరణియార్, మల్లెమడుగు జలాశయాలు నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.