బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో పక్క రాష్ట్రం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తమిళనాడు, కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వాయుగుండం ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మంగళశారం వర్షం కురవగా.. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల జల్లులు,అక్కడక్కడా భారీ వర్షం కురిసింది.
రాష్ట్రంలోని మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.మరోవైపు ఏపీలోని వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో ఒక్కరోజులోనే 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.