ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు గుండెజబ్బులు వయసు పైబడిన వారికి వస్తుండేవి.కానీ, ఇప్పుడు వయస్సుతో అస్సలు సంబంధమే లేదు.పిల్లల నుంచి యుక్తవయసు వారికి కూడా గుండెపోటు వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గుండెపోటు బారిన పడి ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. రాజు -జమున దంపతుల కూతురు ఉక్కులు (5) మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది.వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. హన్మకొండకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు అనంతరం హన్మకొండలోని ఆస్పత్రికి తరలించగా చిన్నారిని పరిశీలించిన వైద్యులు ఆమె మరణించినట్లు చెప్పారు. గుండెపోటు కారణంగా చిన్నారని చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆమెకు గుండె సంబంధిత వ్యాధి ఉండొచ్చని.. పేరెంట్స్ గుర్తించడంలో ఆలస్యం అయ్యిందని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కగానొక్క కూతురు కన్నుమూయడంతో బాధిత పేరెంట్స్ రోదనలు మిన్నంటాయి.