బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడనుంది. దీంతో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.