మేడారానికి మొద‌లైన‌ హెలికాప్టర్ సేవలు.. చార్జ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. మేడారం జాతర పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తోంది. ఇక తాజాగా హైదరాబాద్ నుంచి మేడారం జాతర ప్రాంతానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ సదుపాయాన్ని భక్తులకు దగ్గర చేసింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ హెలికాప్టర్ చార్జ్ ఎంతన్నది తెలిస్తే మాత్రం గుండె గుభేల్మనక మానదు. ఒకరికి రూ. 30 వేలు చెల్లించాలట. దీనికి జీఎస్టీ అదనం సుమా.

హెలికాప్టర్ లో ఆరుగురు ప్రయాణించే వీలుండగా, ఆరుగురున్న కుటుంబం హెలికాప్టర్ లో ప్రయాణించాలంటే, రూ. 1.80 లక్షలకు అదనంగా పన్నులను కలిపి చెల్లించాలి. ఇక ఈ హెలికాప్టర్ సేవలను ఈ ఉదయం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. హెలికాప్టర్ లో వెళ్లేవారికి సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక మేడారంలో రూ. 2,999 ఆదనపు చెల్లింపుతో జాతర ప్రాంతమంతా తిరిగి వచ్చే సదుపాయాన్ని కల్పించామని ఆయన అన్నారు. హెలికాప్టర్ లో యాత్ర చేయాలని కోరుకునే వారు 9400399999 నంబర్‌ ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news