తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ తరగతుల గురించి, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఫీజుల గురించి పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. గతంలోనే ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు నేడు మరోసారి ఆ పిటిషన్ల గురించి విచారణ జరిపింది. ప్రభుత్వం కోర్టుకు ఈ సందర్భంగా ఆన్ లైన్ తరగతులకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసినట్లు ప్రకటన చేసింది.
దూరదర్శన్ మరియు టీశాట్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఏవైనా సందేహాలు వస్తే పాఠశాలల్లో ఉపాధ్యాయుల ద్వారా సందేహాలు నివృత్తి చేసే విధంగా రూపొందించామని ప్రణాళికను రూపొందించామని తెలిపింది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వేర్వేరు సమయాల్లో పాఠాలు ప్రసారం అవ్వడం వల్ల ఇబ్బందులు కలగవని పేర్కొంది.
ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు వేర్వేరు సమయాల్లో డిజిటల్ క్లాసులను నిర్వహిస్తుండటం వల్ల వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పింది. దీంతో హైకోర్టు ప్రభుత్వం తరగతుల విషయంలో స్పష్టమైన విధివిధానాలు రూపొందించిందని పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోర్టు సూచనలు చేసింది. ప్రభుత్వం ఫీజులను సంబంధించి ఇప్పటికే జీవో జారీ చేశామని… నిబంధనలు పాటించని విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చామని తెలిపింది. హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 18కు వాయిదా వేసింది.