తెలంగాణ కార్మీకులు చేపట్టిన సమ్మె నేటితో 39వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై.. హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి రాదని నిన్నటి విచారణలో తేల్చిచెప్పిన హైకోర్ట్.. సమ్మె చట్ట విరుద్ధమని తాము ప్రకటించలేమని స్పష్టం చేసింది. సమ్మెపై ఎస్మా ప్రయోగించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం.. సమస్యను పరిష్కరించాలని గతంలో తాము చాలాసార్లు చెప్పామంటూ గుర్తు చేసింది.
చట్ట పరిధిలోని అంశాల ఆధారంగానే విచారిస్తామని.. వివరించింది. ఇవాళ ఈ రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది. మొత్తంగా ఆర్టీసీ కార్మికులతో చర్చలు కంటిన్యూ చెయ్యాలన్నది హైకోర్టు ఉద్దేశం. ఇప్పటివరకూ అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్లూ చర్చల దిశగా సరైన ప్రయత్నాలు చెయ్యలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక ఇవాళ కూడా హైకోర్టు చర్చల దిశగా మరో ఛాన్స్ తీసుకోవాలని రెండు వైపులా కోరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది..