ఇంత దారుణమా.. ఖదీర్ ఖాన్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్‌

-

మెదక్​ జిల్లాలో దొంగ అనే అనుమానంతో ఖదీర్​ఖాన్ అనే వ్యక్తిపై పోలీసులు ప్రయోగించిన థర్డ్​ డిగ్రీపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్​ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీస్ అధికారిని ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారిగా నియమించాలని.. ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈఘటనలో బాధ్యులుగా భావిస్తున్న మెదక్ పీఎస్ సీఐ, ఎస్సైలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. పోలీసుల దెబ్బలకు బలైన ఖదీర్ ఖాన్ ఘటనను హైకోర్ట్ సుమోటోగా పరిగణించి దోషులు ఎవరో తేల్చాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కోరారు. పోలీసుల థర్డ్ డిగ్రీకే ఖదీర్ ఖాన్ చనిపోయాడనేది నిజమైతే..ఇంతకంటే దారుణం ఉండదన్నారు. ఈ ఘటనకు కారణం తాము కాదని పోలీసులు నిరూపించుకోవాలన్నారు.

ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడనే అనుమానంతో మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్ ను జనవరి 29న పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 2 వరకు పీఎస్ లో ఉంచిన పోలీసులు.. అసలు నిందితుడు ఖదీర్ ఖాన్ కాదని అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్ తీవ్ర గాయాలతో అనారోగ్యానికి గురయ్యాడు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతి చెందాడు. అయితే పోలీసుల చిత్రహింసలకే ఖదీర్ ఖాన్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఖదీర్ ఖాన్ భార్య సిద్ధేశ్వరి ఆమె పిల్లలతో కలిసి శుక్రవారం మెదక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మెదక్ టౌన్ ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్ పవన్ కుమార్, ప్రశాంత్ తన భర్తను కొట్టడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆరోపించింది. కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version