తాము పరీక్షలను వాయిదా వేయగలం కానీ … రద్దు చేయలేమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని, చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. ఎన్ఎస్యూఐ సహా మరో రెండు సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
జేఈఈ, నీట్‌కు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ వేర్వేరన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని రద్దుచేసి.. పది, ఇంటర్ తరహాలో అందరినీ ఉత్తీర్ణులను చేయాలని ఎన్ఎస్యూఐ తరఫు న్యాయవాది దామోదర్ రెడ్డి కోరారు. ఈ అంశంపైనా సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయని.. నేడు తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. పిటిషన్లపై విచారణను హైకోర్టు.. ఎల్లుండికి వాయిదా వేసింది