గత కొద్ది రోజుల ముందు కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న హిజాబ్ వివాదం ఆ రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమాజంలో ఉన్న రెండు ప్రధాన వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో విద్యార్థినులు ధరిస్తున్న హిజాబ్ పై పెద్ద వివాదం చోటు చేసుకుంది. కర్ణాటక లో ప్రారంభం అయిన ఈ వివాదం దేశ వ్యాప్తంగా పాకింది. కాగ నేడు ఈ హిజాబ్ వివాదంపై బెంగళూర్ హై కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.
కాగ కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చిన సమయంలో ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. మత చిహ్నాల వస్త్రా ధారణ పై నిషేధం విధిస్తు ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తు కొంత మంది ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైనా.. పిటిషన్లను బెంగళూర్ హై కోర్టు పదకొండు రోజుల పాటు విచారణ చేపట్టింది. కాగ నేడు తుది తీర్పును ఇవ్వనుంది.
ఈ రోజు ఉదయం 10 : 30 గంటలకు బెంగళూర్ హై కోర్టు హిజాబ్ వివాదంపై తుది తీర్పును వెలువరించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ను ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే బెంగళూర్ నగరంలో 144 సెక్షన్ ను కూడా విధించారు.