‘ హిజాబ్’ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కర్ణాటకలో ప్రారంభమైన ఈవివాదం.. మెల్లిమెల్లిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చిన్నగా మొదలైన ఈ వివాదం మొత్తం కర్ణాటకలో ఉద్రిక్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం తెలుపుతూ.. కాషాయ శాలువాలతో తరగతులకు హాజరు కావడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక హైకోర్ట్ లో విచారణలో ఉంది. ఇప్పటికే కర్ణాటక హైకోర్ట్ హిజాబ్ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యాలయాల్లోకి ఎలాంటి మతపరమైన దుస్తులతో రావద్దని ఆర్డర్స్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని విద్యాలయాల్లో విద్యార్థులు యూనిఫాంలో రావాలంటూ..ఆదేశాలు ఇచ్చిన కర్ణాటక సర్కార్.. మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిడిచే స్కూళ్లు, కాలేజీల్లోనూ మతపరమైన వస్త్రధారణను నిషేధించింది. కాషాయ శాలువాలు, స్కార్ఫ్, హిజాబ్ మతపరమైన జెండాలను తరగతి గదుల్లోకి తీసుకురావద్దని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.